ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు తప్పిన ప్రమాదం
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు
- బర్త్ డే వేడుకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
- తిరిగి వెళుతున్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయిన లిఫ్ట్
మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కవ్వంపల్లి ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కూడా ఉన్నారు.
ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. వేడుకలు ముగించుకుని భవనంలోని రెండో అంతస్తు నుంచి వారు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లిఫ్ట్ ఒక్కసారిగా నేరుగా కిందకు పడిపోయింది.
భారీ శబ్దానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అనుచరులు క్రాష్ అయిన లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఇద్దరు నేతలను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో నాయకులు, కార్యకర్తలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకే లిఫ్ట్‌లో ఇద్దరు వేర్వేరు పార్టీల నేతలు ఉండటం, ఈ ప్రమాదం జరగడం స్థానికంగా సంచలనంగా మారింది.